స‌వ్య‌సాచి

0
113

స‌వ్య‌సాచి గురించి తొలిసారి విన్న‌ప్పుడు ఓ చిన్న జ‌ర్క్ వ‌చ్చింది.

‘హీరో ఎడ‌మ చేయి… త‌న కంట్రోల్‌లో ఉండ‌దు.. త‌న మాట విన‌దు..’ అనే పాయింటే కొత్త‌గా అనిపించింది.
అయితే ఆ పాయింట్ తో రెండున్న‌ర గంట‌లు ఎలా కూర్చోబెడ‌తాడు? ద‌ర్శ‌కుడు కాన్లిఫ్ట్ ఎలా చూపిస్తాడు? అస‌లు ఈ పాయింట్ సామాన్య ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌వుతుందా? క‌నెక్ట్ అవుతుందా? అనే ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు. ఇప్పుడు వాటికి స‌మాధానంగా ‘స‌వ్య‌సాచి’ వ‌చ్చేసింది. మ‌రి అనుమానాలు నివృత్తి అయ్యాయా? లేదంటే అవే సుడిగుండాల్లా చుట్టేశాయా?

క‌థ‌

విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌) పుట్ట‌కే ఓ అద్భుతం. నిజానికి క‌వ‌ల‌లు పుట్టాల్సింది ఒక్క‌డే పుట్టాడు. కానీ.. త‌న ఎడ‌మ చేయి… ‘సోద‌రుడు’లానే ప్ర‌వ‌ర్తిస్తుంటుంది. త‌న‌కంటూ ఓ ఆలోచ‌న, ఇష్టం ఉంటాయి. ఆనందం వ‌చ్చినా, సంతోషం వ‌చ్చినా, ఎడ‌మ చేయి కంట్రోల్ త‌ప్పుతుంటుంది. చిత్ర (నిధి అగ‌ర్వాల్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు విక్ర‌మ్‌. త‌ను కూడా ఇష్ట‌ప‌డే స‌మ‌యానికి.. చెప్ప‌కుండా వెళ్లిపోతాడు. మ‌ళ్లీ ఆరేళ్ల‌కు క‌లుస్తాడు. మ‌ళ్లీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించే స‌మ‌యానికి విక్ర‌మ్ కుటుంబంలో పెను విషాదం. బావ దుర్మ‌ర‌ణం పాల‌వుతాడు. అక్క ఆసుప‌త్రిలో ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతుంటుంది. అమ్మ‌లా చూసుకున్న మేన కోడ‌లు కూడా మాయం అవుతుంది. దానంత‌టికీ కార‌ణం ఎవ‌రు? అరుణ్ (మాధ‌వ‌న్‌)కీ విక్ర‌మ్‌కీ ఉన్న శ‌త్రుత్వం ఏమిటి? అనేది తెర‌పై చూడాలి.

విశ్లేష‌ణ‌

`వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌` అన్న‌ది కొత్త పాయింట్‌. దానికి క‌నెక్ట్ అయితే సినిమాకి, ఈ క‌థ‌కీ, పాత్ర‌ల‌కూ కనెక్ట్ అవుతారు. లేదంటే.. సినిమా మొత్తం గాడి త‌ప్పిపోతుంది. ఇలాంటి క‌థ ఎంచుకున్న‌ప్పుడు ఈ త‌ర‌హా ప్ర‌మాదం ఉంటుంద‌ని చిత్ర‌బృందానికి ముందే తెలుసు. కానీ.. రిస్క్ చేయ‌గ‌లిగారు. ఆ పాయింట్ చుట్టూ కొన్ని క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు జోడించుకుంటూ వెళ్లారు. సెకండాఫ్‌లో వ‌చ్చే మాధ‌వ‌న్ పాత్ర అలాంటిదే. నిజానికి ద్వితీయార్థంలో క‌థానాయ‌కుడు – ప్ర‌తినాయ‌కుడు మ‌ధ్య జ‌రిగే మైండ్ గేమ్‌కీ ఈ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌కీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. సినిమా అంతా కాకుండా.. అక్క‌డ‌క్క‌డ మాత్రమే ఈ పాయింట్‌ని ద‌ర్శ‌కుడు వాడుకున్నాడు.

క‌థ‌ని మొద‌లెట్టిన తీరు ఆసక్తిగా ఉంటుంది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డిపోవ‌డం, ఆ ప్ర‌మాదం నుంచి హీరో ఒక్క‌డే బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డం – ఈ స‌న్నివేశాలు థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కుడ్ని ఒక్క‌సారిగా మూడ్ లోకి తీసుకెళ్లిపోతాయి. కానీ… ఆ వెంట‌నే వ‌చ్చే కాలేజీ ఎసిసోడ్లు, అమెరికా స‌న్నివేశాలు… ఆ ఫీల్‌నీ, మూడ్‌నీ డిస్ట్ర‌బ్ చేస్తాయి. విశ్రాంతి వ‌ర‌కూ.. క‌థ అంగుళం కూడా ముందుకు క‌ద‌ల‌దు. క‌థ ఎక్క‌డ మొద‌లైందో, అక్క‌డే ఉంటుంది. త‌న చావుని ఒక‌డు కోరుకుంటున్నాడ‌ని క‌థానాయ‌కుడికి తెలియ‌డం త‌ప్ప – విశ్రాంతి ముందు వ‌ర‌కూ ఎలాంటి క్లూ దొర‌క‌డు. క‌థ మొద‌లైన పావుగంట‌కే గ‌మ‌నం తెలియాల‌న్న‌ది స్క్రీన్ ప్లే సిద్ధాంతం. గంట‌న్న‌ర అయినా… దాన్ని పాటించ‌క‌పోవ‌డం ఇబ్బంది క‌లిగిస్తుంది. అలాగ‌ని వాటి మ‌ధ్య ఫిల్ చేసిన సీన్ల‌యినా బాగున్నాయా అంటే అదీ లేదు. అక్క‌డ‌క్క‌డ కొన్ని న‌వ్వులు త‌ప్ప‌- ఇంకేం క‌నిపించ‌వు. ల‌వ్ ట్రాక్ మ‌రీ బోరింగ్‌గా అనిపిస్తుంది. చిత్ర‌ని వ‌దిలి విక్ర‌మ్ ఆరేళ్లు గ‌డిపేయ‌డానికి, వాళ్ల మ‌ధ్య దూరం రావ‌డానికి స‌రైన లాజిక్ లేదు. కామెడీ వీర లెవిల్లో పండుతుంద‌నుకున్న సుభ‌ద్రా ప‌రిణ‌యం ఎపిసోడ్ కూడా.. అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు.. కొన్ని డైలాగుల్లో డ‌బుల్ మీనింగ్ ధ్వ‌నించింది.

అస‌లు అరుణ్‌లో ప్ర‌తీకార జ్వాల ఆ స్థాయిలో ర‌గ‌ల‌డానికే లాజిక్ లేదేమో అనిపిస్తుంది. స‌మాజంపై, మ‌రీ ముఖ్యంగా 21 మందిపై అరుణ్ ఈ స్థాయిలో ప‌గ పెంచుకోవ‌డానికి బ‌ల‌మైన కారణాలు చూపిస్తే బాగుండేది. ‘ఈ మాత్రం దానికి.. ఇంత చేయాలా’ అన్న సందేహం ఎప్పుడొచ్చిందో – ఆ స‌మ‌యంలోనే అప్ప‌టి వ‌ర‌కూ చూసిన సన్నివేశాల‌తో, చూడ‌బోయే అంశాల‌తో క‌నెక్ష‌న్ క‌ట్ అయిపోతుంది. హీరో – విల‌న్ ల మ‌ధ్య మైండ్ గేమ్ కూడా అంత ఆస‌క్తిగా అనిపించ‌దు. ఫోన్ల‌తో ఛాలెంజులు విసురుకోవ‌డం, హీరో – విల‌న్‌లు బ్లూటూత్ ద్వారా మాట్లాడుకోవ‌డం అనే కాన్సెప్టు నుంచి టాలీవుడ్ బ‌య‌ట‌ప‌డితే మంచిది. ముగింపులో కూడా మ‌నం ఊహించ‌ని అద్భుతాలేం జ‌ర‌గ‌వు. శ‌త్రు నాశ‌నంతోనే ఈ క‌థ ముగుస్తుంది.

న‌టీన‌టులు

నాగ‌చైత‌న్య కూల్‌గా ఉన్నాడు. ఇది వ‌ర‌క‌టి సినిమాల కంటే అందంగా క‌నిపిస్తున్నాడు. అలాగ‌ని త‌న బ‌ల‌హీన‌త‌ల్ని దాచుకోలేక‌పోయాడు. అక్క‌డ‌క్క‌డ బ‌య‌ట‌పడుతూనే ఉన్నాయి. నిధి అగ‌ర్వాల్ చూడ్డానికి బాగుంది. అంత వ‌ర‌కే. మాధ‌వ‌న్ ఈ సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించేస్తాడ‌నుకుంటారంతా. కానీ… ఆ పాత్ర‌ని మ‌నం ఊహించుకున్న స్థాయిలో డిజైన్ చేయ‌లేదు. దాదాపుగా మాధ‌వ‌న్ ది సోలో ప‌ర్‌ఫార్మెన్సే. ఫోన్‌లో మాట్లాడ‌డానికే ఎక్కువ కాల్షీట్లు ఇచ్చి ఉంటాడు. భూమిక ఓకే. వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ లేక‌పోతే. తొలి స‌గం మ‌రీ బోరింగ్‌గా అనిపించేది.

సాంకేతిక వ‌ర్గం

కీర‌వాణి స్వ‌రాల్లో కొత్తద‌నం లోపించింది. రీమిక్స్ గీతానికీ ఆయ‌న న్యాయం చేయ‌లేక‌పోయారు. స‌వ్య‌సాచీ.. అంటూ ఇచ్చిన రీ రికార్డింగ్ లో మాత్రం ఆయ‌న మార్క్ క‌నిపిస్తుంది. నిర్మాణ విలువ‌ల విష‌యంలో మైత్రీ మూవీస్ ఎలాంటి లోటు చేయ‌లేదు. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. సినిమా క‌ల‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఆర్ట్ ప‌నిత‌నం కూడా ఆక‌ట్టుకుంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here