ఎద్దేవా చేయ‌డ‌మేనా… వాస్త‌వాలు వ‌క్రీక‌రిస్తే ఎలా..?

0
119

ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయి రెడ్డి మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఎద్దేవా చేశారు. ఐదేళ్లకోసారి ఎన్నిక‌లు జ‌రిపితే అభివృద్ధి నిలిచిపోతుంద‌నీ, మ‌రో ముప్ఫ‌య్యేళ్లు ఎన్నిక‌లు అవ‌స‌రం లేదంటూ ఆయ‌న జీవో తీసుకొచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహన్ రెడ్డి హ‌త్య‌కు ప్లాన్ వేశార‌నీ… కానీ, విమానాశ్ర‌యం కేంద్రం నియంత్ర‌ణలో ఉంటుందని సీఎం అన్నార‌న్నారు. ఇప్పుడు రాష్ట్రంలోకి సీబీఐని అడుగు పెట్ట‌నిచ్చేది లేదంటూ ఆయ‌నే అన‌డంలో ఆంత‌ర్యం ఏంటంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ప్ర‌శ్నించారు. మానోట్లు మేమే ముద్రించుకుంటాం, మా మిలిట‌రీ మేమే ఏర్పాటు చేసుకుంటాం, మా రైళ్లు, విమానాలు మేమే న‌డుపుకుంటాం అంటారేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడి మాన‌సిక ప‌రిస్థితి బాలేద‌ని కూడా విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

సీబీఐ విష‌య‌మై రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌దేప‌దే వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్న‌మే వైకాపా నేత‌లు చేస్తున్నారు. వాస్త‌వాల‌ను వారు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదో, ప్ర‌జ‌ల‌కు తెలియ‌కూడ‌ద‌ని మ‌భ్య‌పెడుతున్నారో తెలీదు. సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం జ‌గ‌న్ పై కోడి క‌త్తి దాడి కేసుని ఏర‌కంగానూ ప్ర‌భావితం చెయ్య‌లేద‌న్న‌ది వాస్త‌వం. కోడి క‌త్తి కేసుపై సీబీఐ విచార‌ణ జ‌ర‌క్కూడ‌ద‌నే టీడీపీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌నే ప్ర‌చారం ముమ్మాటికీ అవాస్త‌వం. ఎందుకంటే, ప్ర‌స్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. అంటే, దానిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల‌న్నా అది కోర్టు ప‌ని. దాన్ని అనుస‌రించాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంటుంది. కోడి క‌త్తి కేసును సీబీఐతో విచారించండీ అని కోర్టు ఆదేశిస్తే కాద‌నేది ఎవ‌రు..? జ‌న‌ర‌ల్ క‌న్సెంట్ వెన‌క్కి తీసుకోవ‌డం వ‌ల్ల ఈ కేసులో సీబీఐకి ప్ర‌వేశం లేకుండా చేయ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వానికి సాధ్యం కానే కాదు. కోర్టు ఆదేశంతో సీబీఐకి ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించిన స‌ర్వాధికారాలూ వ‌స్తాయి.

సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు పూర్తిగా అవ‌గాహ‌నా రాహిత్యంతో చేసిన‌వే. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌నీయ‌కుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా మార్చుకునేందుకు చేసే ప్ర‌య‌త్న‌మే ఇది. ఎద్దేవా చేయ‌డానికి కూడా కొంత‌ హ‌ద్దుంటే.. హుందాగా ఉంటుంది. వైకాపాలో తానే మేధావి అన్న‌ట్టుగా మాట్లాడే విజ‌య‌సాయి రెడ్డి… ఈ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఎందుకు లా పాయింట్లు మాట్లాడ‌టం లేదు..? నోట్ల‌ను ముద్రిస్తారేమో, రైళ్లు న‌డుపుతారేమో అంటూ… ప్ర‌భుత్వం నిర్ణ‌యంలోని వాస్త‌వాల‌ను ఎందుకు వ‌క్రీక‌రిస్తున్నారు…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here